టేకులపల్లి, మార్చి 22: మారుమూల గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్య తెలియని రోజుల్లో ఏర్పాటైన పాఠశాల అది. 46 ఏళ్లుగా ఆదివాసీ పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పిస్తున్న ఆశ్రమ పాఠశాల అది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకూ ఎదిగిన సర్కారు బడి అది. తన ఒడిలో విద్యాబోధన అందించి ఎందరో గిరిజన బిడ్డలను ఉన్నతోద్యోగులుగా తీర్చి దిద్దిన విద్యా ధామమది. అదే.. టేకులపల్లి మండ లంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేక అక్కడి పిల్లలకు అక్షరజ్ఞానం తెలియని కాలంలో భద్రాచలం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైందీ పాఠశాల. అప్పటి బూర్గంపహాడ్ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ పూనెం రామచంద్రయ్య సహకారంతో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ఇక్కడ చదివిన విద్యార్థుల్లో ఎంతోమంది విద్యా, క్రీడా, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
1976లో ప్రారంభం.. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1976లో గిరిజనుల చదువు కోసం పూర్వ ఖమ్మం జిల్లాలో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న రోజులవి. ఈ క్రమంలో పూన్నెం రామచంద్రయ్య తన సొంత గ్రామమైన కోయగూడెంలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు కోసం ఎకరా భూమిని దానం చేశారు. తొలుత ప్రాథమిక పాఠశాలను పెంకుటింట్లో ప్రారంభించారు. మళ్లీ ఆయన కృషితోనే 1986లో అది ప్రాథమికోన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. ఆయనే మరో రెండుకరాలు దానం చేయడంతో 2001లో అది హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం 3 నుంచి 10 తరగతుల్లో తెలుగు మీడియం విద్యార్థులు 189 మంది, 3 నుంచి 8 తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 97 మంది ఇక్కడ చదువుకుంటున్నారు.
సకల సదుపాయాలు.. : పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ ఉంది. మొత్తం 21 తరగతి గదులు, 14 హాస్టల్ గదులు ఉన్నాయి. సకల సౌకర్యాలతో విశాలమైన గదులు ఈ పాఠశాల ప్రత్యేకం. డిజిటల్ విద్యాబోధన, ప్రత్యేక లైబ్రరీ, స్పోర్ట్స్ స్టోర్ రూమ్, రెండు ల్యాబ్‌లు (జన్యు, సైన్స్), హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్, కోయగూడెం, శాంతినగర్ గ్రామాలకు చెందిన 53 మంది విద్యార్థులు సైతం ప్రతి రోజూ ఈ పాఠశాలకు వస్తుంటారు. వారికి మధ్యాహ్న భోజనం సౌకర్యమూ అందుతోంది. గడిచిన ఆరేళ్లలో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం పైగానే ఉత్తీర్ణత నమోదవుతోంది.
ఆశ్రమ పాఠశాలలో మంచి సౌకర్యాలున్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాబోధన జరుగుతోంది. డిజిటల్ తరగతులు, ప్రయోగశాల, ఆట స్థలం, విశాలమైన హాస్టల్, ఆర్వో ప్లాంట్ వంటి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. గతంలో ఈ పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో చాలా మంది వరకూ ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారు. -బీ.సైదులు, హెచ్ఎం