ఖమ్మం వ్యవసాయం, మార్చి 17: బడిలో లేని పిల్లలను బాల కార్మికులుగా గుర్తించి వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ జే.శ్రీనివాసరావు సూచించారు. ‘బాల కార్మికులు, బాండెడ్ లేబర్, మహిళల అక్రమ రవాణా’ వంటి అంశాలపై ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో గురువారం జరిగిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమాలను ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. బాలల సమస్యల పరిష్కారానికి పరిరక్షణ కమిటీ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం అయిన తరువాత పిల్లల హాజరు 10 శాతం తగ్గిందన్నారు. ఆయా గ్రామాల్లో బాల్యవివాహాలు జరగడం, పిల్లలను ఇతర పనుల్లో ఉంచడం వంటివి ఇందుకు కారణమయ్యాయన్నారు. కాబట్టి అధికారులు గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు సైతం బాల కార్మికుల పెరుగుదలకు, బాల్య వివాహాలకు కారణమవుతున్నాయన్నారు. వీటి నిర్మూలనకు తమ శాఖ ద్వారా కళాజాతాలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ఆడపిల్లల రక్షణకు కోసం పీసీపీఎన్డీ యాక్టు అమల్లో ఉందని డీఎల్ఎస్ఏ సెక్రటరీ జావిద్‌పాషా తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ డీసీపీ కరీంపాషా, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు బృందాదర్రావు, డీడబ్ల్యూవో సంధ్యారాణి, భారతీరాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.