మణుగూరు రూరల్, ఫిబ్రవరి 16: ఉద్యమ నాయకుడు కేసీఆర్ సంకల్పం ఎంత గొప్పదో తెలుసుకునేందుకు అనేక ఉదాహరణలు తారసపడతాయి. అందుకే ఆయనది ఉక్కు సంకల్పం అంటారు ఆయనను దగ్గరగా పరిశీలించిన వారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకూ ఈ పదం, ఆయన వ్యక్తిత్వం సుపరిచితం. అవతలి వారు ఎన్ని అపవాదులు మోపినా తాను మాత్రం మొక్కవోని దీక్షతో ముందుకెళ్తారు. అంతిమంగా విజయాన్ని చూపిస్తారు. ఈ కోవలోకే వస్తుంది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కూడా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తొలినాళ్లలో విద్యుత్ కొరత ప్రధాన సమస్యగా మారుతుందనే అంశాన్ని ప్రధానంగా చూపి ఎద్దేవా చేశాయి ప్రతిపక్షాలు. ఆ సమస్య ఉత్పన్నం కాదన్నది సీఎం కేసీఆర్ నమ్మకం. రాష్ట్ర ప్రజలకు 24 గంటల నిరంతరాయంగా విద్యుత్ అందాలన్నది ఆయన ఆశయం. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీరిదిద్దాలన్నది సంకల్పం. అందుకే విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టిసారించారాయన. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు – పినపాక మండలాల సరిహద్దు గ్రామాల్లో సుమారు 1170 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడ 1080 మెగావాట్ల (4×270) విద్యుత్ ఉత్పత్తి కోసం బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2015 మార్చిలో ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ఆయన.. సరిగ్గా ఆరేళ్లు పూర్తికాకముందే దాన్ని పూర్తి చేయించారు. ఒక్కో యూనిట్‌ను పూర్తి చేసుకుంటూ ముందుసాగిన ఆయన.. ఈ ఏడాది జనవరి 9 నాటికి మొత్తం నాలుగు యూనిట్లనూ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విద్యుదుత్పత్తిలో 1080 మెగావాట్లతో బీటీపీఎస్‌కు భాగస్వామ్యాన్ని కల్పించారు. ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల్లో చాలామంది పరిహారం అందుకున్నారు. మరికొందరు పరిహారం వదులుకొని ఉద్యోగాన్ని కోరుకున్నారు. మొత్తం 346 మందికి నియామకపత్రాలు అందాయి.