సత్తుపల్లి, మార్చి 15: గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక యాతనపడుతుంటారు. కొందరైతే ఊపిరి బిగపట్టుకుని ఇంటికి చేరేదాకా అలాగే ఉంటారు. ఒక విధంగా ఇది వారి గౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఒకరి సమస్య కాదు.. పట్టణాల్లోని రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేస్తున్న వారు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది మహిళల సమస్య. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో విరి విరిగా ‘షీ’ టాయిలెట్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. దీనిలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో స్త్రీ, పురుషుల కోసం వేర్వేరుగా రూ.5 కోట్లతో 46 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. సత్తుపల్లిలో నాలుగు మరుగుదొడ్లు, వైరాలో నాలుగు, మధిరలో నాలుగు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశాలు, బస్టాండులు, వ్యాపార సముదాయాలు ఉండే ప్రదేశాల్లో ఈ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. వీటి పరిధిలో మహిళల కోసం ‘షీ’ టాయిలెట్ల నిర్మా ణమూ పూర్తయింది. పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.
ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లు నిర్మిస్తున్నది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక టాయిలెట్ చొప్పున ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పట్టణ, పల్లె ప్రగతి పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు సంపూర్ణ పారిశుధ్యం వైపు పయనిస్తున్నాయి. ఈ పథకానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో పట్ణణాలు, గ్రామాల్లో బహిర్భూమికి వెళ్లడం, బహిరంగ మూత్ర విసర్జన చేసే అవసరం లేకుండాపోయింది.మరోవైపు పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి రావడంతో పట్టణాలు స్వచ్ఛత దిశగా పయనిస్తున్నాయి.
గతంలో సత్తుపల్లి పట్టణానికి వచ్చేవారు పబ్లిక్ టాయిలెట్లు లేక ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడేవారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వారి కోసం పట్టణంలో నాలుగు చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం. దీంతో వారి బాధలు తీరాయి.
-కూసంపూడి మహేశ్, మునిసిపల్ చైర్మన్, సత్తుపల్లి