భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానిది నిరంకుశత్వమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ధరలు పెంచడం, తెలంగాణ ధాన్యం కొనకపోవడం వంటి చర్యలపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలనూ పెంచారని, సామాన్యులను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. పెనగడపలో ఆటోని తాళ్లతో లాగి నిరసన వ్యక్తం చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఎంపీపీ సోనా, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్పాషా, ఎంపీటీసీ భద్రమ్మ, వినోద్, పరంజ్యోతిరావు పాల్గొన్నారు.