ఖమ్మం వ్యవసాయం, మార్చి 25: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటా ధర రూ.200 – 400 పెరుగుతోంది. కొద్ది రోజుల నుంచి రూ.10 వేల మార్క్‌ను దాటిన తెల్ల బంగారం ధర కేవలం వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.1,500 వరకు పెరిగింది. శుక్రవారం ఉదయం పత్తియార్డుకు రైతులు 988 బస్తాలను తీసుకొచ్చారు. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తి పంటకు రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ వ్యాపారులు సైతం పోటీపడుతుండడంతో ఆన్లైన్ బిడ్డింగ్‌లో పంటను సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. దీంతో గరిష్ఠ ధర క్వింటా రూ.11,500 పలికింది. మధ్య ధర రూ.10,800, కనిష్ఠ ధర రూ.5 వేల చొప్పున వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. సీజన్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన పత్తి ధరలు పంట చివరి రోజుల్లోనూ అదే ఒరవడిని కొనసాగించాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పంటకు ధర పలుకుతుండడంతో ఇంతకాలం పంటను నిల్వపెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తున్న రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.