ఖమ్మం రూరల్, మార్చి 15 : నగర వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయి నూతన వ్యవసాయ మార్కెట్‌గా మద్దులపల్లి రూపాంతరం చెందింది. ఈ మార్కెట్ ఆరంభం నుంచి లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జిస్తున్నది. యార్డు నిర్మాణం కాకపోయినా ఉన్న వనరుల నుంచి వచ్చే ప్రతిపైసా వసూలు కావడంతో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ నిర్దేశించిన లక్ష్యాలను ఛేదిస్తున్నది. 2018 అక్టోబర్‌లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయింది. మద్దులపల్లి మార్కెట్‌గా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ నోటిఫై చేసింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని 44 గ్రామాలు ఈ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. రూరల్ మండలం మద్దులపల్లి రెవెన్యూ పరిధిలో ఎన్నెస్పీ కాలువ పక్కన సుమారు 24 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ రూ.15 కోట్లను కేటాయిస్తూ పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. జాతీయ ప్రధాన రహదారికి పక్కనే నూతన మార్కెట్ నిర్మించనుండడంతో రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. సీసీఐ, ఇతర కొనుగోలు కేంద్రాలకు అనువుగా ఉండనున్నది. ప్రస్తుతం నూతన మార్కెట్‌కు పాలకవర్గంతోపాటు ఇద్దరు పర్యవేక్షకులు, ఏఎంఎస్-1, జేఎంఎస్-1, ఇద్దరు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డులతో పాటు అటెండర్, డీఈవోను ఖమ్మం ఏఎంసీ నుంచి కేటాయించారు. తొలి రెండేండ్లలో నిర్దేశిత లక్ష్యం లేకపోయినా మంచి ఆదాయం సమకూరింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ 2020-21, 2021-22 సంవత్సరాలకు గాను రూ.1.60 కోట్లు, రూ.1.80 కోట్లుగా నిర్దేశించగా.. గతేడాది రికార్డుస్థాయిలో రూ.3.73 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం సీసీఐ కేంద్రాలు లేకపోయినా రూ.1.86 కోట్ల ఆదాయం రావడం విశేషం.
సాంకేతిక కారణాలతో మార్కెట్ నిర్మాణ పనులు కొంత ఆలస్యమైనా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతున్నది. ప్రస్తుతం మార్కెట్ పరిధిలో ఒక చెక్‌పోస్టు ఉంది. అయితే, ఈ సంవత్సరం రూ.35 లక్షలు, జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లుల వద్ద జరిగే క్రయవిక్రయాలు, ప్రైవేట్ ఖరీదుదారుల ద్వారా వచ్చే సెస్, తదితర వనరుల ద్వారా రూ.కోటి వచ్చింది. ఐకేపీ, సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మరో రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది నేటివరకు రూ.1.86 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ నిర్దేశించిన లక్ష్యం రూ.1.80 కోట్ల మార్క్‌ను ఇప్పటికే చేరుకున్నది. మార్చి 31నాటికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
మద్దులపల్లి మార్కెట్ పరిధిలో ప్రస్తుతం 6 కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు 6-7 లక్షల బస్తాలను నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఏటా కోల్డ్‌స్టోరేజీల ద్వారా మార్కెట్‌కు సుమారు రూ.కోటిపైగా ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువగానే వస్తున్నా.. ఖమ్మం మార్కెట్ ట్రెజరీలోకి వెళ్తోంది. యార్డు లేకపోవడంతో దూరమైనా అక్కడికి శాంపిల్ బస్తాలను తీసుకెళ్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్‌శాఖ ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ ఆదాయం వస్తున్నది. యార్డు అందుబాటులో లేకపోయినా ఇతర వనరులను సద్వినియోగం చేసుకుని రైతులకు సేవలందిస్తున్నాం. అదే తరహాలో మార్కెట్ సెస్ వసూలు చేస్తున్నాం. త్వరలో మార్కెట్‌యార్డు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది.
-మల్లీడు అరుణ, చైర్పర్సన్, మద్దులపల్లి ఏఎంసీ
మార్కెట్ నిర్మాణానికి అనువైన భూములను ఎంపిక చేశారు. భవన నిర్మాణాలు, మరో 16 రకాల పనులకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇక్కడికి వెళ్లేందుకు రోడ్ సౌకర్యం లేకపోవడంతో గుత్తేదారు పనులు ప్రారంభించలేదు. రెండు సర్వే నంబర్లలో భూమి ఉండడం, మధ్యలో రైతుల భూమి ఉండడం.. ఇలా పలు కారణాలతో నిర్మాణ పనులు జరుగలేదు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఎన్నెస్సీ అధికారులతో మాట్లాడారు. మార్కెట్‌యార్డు వరకు వెళ్లేందుకు అనువైన 100 అడుగుల అప్రోచ్ రోడ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారంగా గుత్తేదారుకు కాంట్రాక్టు అప్పగించేందుకు మార్కెటింగ్‌శాఖ నుంచి అనుమతి రానున్నది. దీంతో త్వరలో మద్దులపల్లి మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనున్నది.
