మణుగూరు టౌన్, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలకు మరింత భరోసా కలుగుతోందని అన్నారు. మండలంలోని సమితి సింగారం, విప్పలసింగారం, జీఎం ఆఫీస్ సింగారం, పగిడేరు, ఉడతానినగర్, కొండాయిగూడెం, పినపాక మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామాల్లోని చెందిన వివిధ పార్టీలకు చెందిన 300 కుటుంబాల వారు ఆదివారం రాత్రి మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రభుత్వ విప్ రేగా.. గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయని, ఆ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. సొంత జాగా ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే పథకాన్ని సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత : విప్ రేగా
రాష్ట్రంలో క్రీడలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలోని వాసవీనగర్ గిరిజన భవన్లో ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్షిప్-2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకుసాగాలని, గెలుపోటములు ప్రధానంకాదని, క్రీడల్లో రాణించి గొప్ప నైపుణ్యత ప్రదర్శించాలన్నారు. క్రీడాకారులు జాతీయస్థాయిలో విజయం సాధించి తల్లిదండ్రులు, దేశానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కరాటే చాంపియన్షిప్ నిర్వాహకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.