మామిళ్లగూడెం, డిసెంబర్ 9: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలకు 668 మంది అభ్యర్థులు హాజరైనట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శుక్రవారం ఈ పరీక్షలకు 798 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 668 మంది హాజరైనట్లు చెప్పారు. ఇందులో 267 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు అర్హత సాధించినట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగాల ఎంపికలో భాగంగా ప్రతి అంశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆరోపణలకు తావులేకుండా ఉండేందుకు ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి ఈవెంట్ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలుంటే సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నివృత్తి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నిర్దేశించిన ఎత్తు కంటే ఒక సెంటీమీటరు తకువ వచ్చిన అభ్యర్థులకు వారి విజ్ఞప్తి (అప్పీల్)మేరకు రీ మెజర్మెంట్ (మరలా ఎత్తుకొలిచే) అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అవసరమైన అభ్యర్థులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం అందుబాటులో ఉందని వివరించారు.