రఘునాథపాలెం, మార్చి 5: శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురవుతున్న దళితుల సాధికారత కోసం తెలంగాణ సర్కారు ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఎలాంటి బ్యాంకు లింగేజీ లేకుండానే ఆర్థిక చేయూత అందించాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అందించిన సాయం పూర్తి ఉచితంతోపాటు తిరిగి ఎలాంటి చెల్లింపులు చేయనక్కర్లేదు. అంతేకాదు.. లబ్ధిదారులు తమకు అనువైన యూనిట్నే ఎంపిక చేసుకోవచ్చు. దళితబంధు సాయాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనుంది. తొలి విడతగా నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించిన వంద మందిలో 97 మందిని ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెంలోని ఈర్లపూడి గ్రామానికి చెందిన వారినే గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఖమ్మం కార్పొరేషన్‌లోని పాండురంగాపురం నుంచి ఒకరిని, 32వ డివిజన్ నుంచి ఇద్దరిని గుర్తించారు.
దళితబంధు పథకానికి ఎంపికైన ఈర్లపూడిలో సర్వే ప్రక్రియ పూర్తయింది. పథకం అమలుకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి ఇటీవల గ్రామానికి వెళ్లి నేరుగా లబ్ధిదారులను కలిశారు. పథకం ద్వారా ప్రభుత్వం అందించే రూ.10 లక్షల ఆర్థిక సాయంతో ఎలాంటి వ్యాపారాలు చేస్తారని, కుటుంబాలను ఆర్థికంగా ఏవిధంగా బలోపేతం చేసుకుంటారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌ను జాబితాలో నమోదు చేసుకున్నారు. లబ్ధిదారులకు ఈ నెలలో యూనిట్లు గ్రౌండింగ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎంతో కాలంగా వివక్షతకు గురైన దళితులను తెలంగాణ సర్కారు గుర్తించింది. దళితబంధు పేరుతో ఇంత పెద్ద మొత్తంగా ఆర్థిక సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. -కురువెళ్ల భాస్కర్, ఈర్లపూడి
రాష్ట్రంలోనే దళితులకు గౌరవం దక్కింది. గతంలో ఎస్సీలకు ఆర్థిక సాయం దక్కేదికాదు. దళిత బాంధవుడిగా మా కష్టాలు గుర్తించిన సీఎంకేసీఆర్కు రుణపడి ఉంటాం. దళితబంధు కింద తొలిదఫాగా వచ్చిన నిధులన్నీ రఘునాథపాలెం మండలంలోని దళితులకు కేటాయించిన మంత్రి అజయ్‌కి జీవితాంతం రుణపడి ఉంటాం.
-కాంపాటి రవి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు