మామిళ్లగూడెం, ఫిబ్రవరి 5: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను మార్చి నెల ఆఖరు నాటికి పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి గురించి పీఆర్ ఎస్ఈతో కలిసి జిల్లాలోని డిప్యూటీ ఈఈలు, ఏఈఈతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ.18.96 కోట్లతో 425 సీసీ రోడ్ల పనులు మంజూరు చేశామన్నారు.
ఈ పనులను మార్చి నెల ఆఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అదనంగా అవసరమైన రోడ్లకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కలెక్షన్, సబ్ బేస్ ఫార్మేషన్, ఏజెన్సీ కేటాయింపు పనులను శుక్రవారంలోపు చేపట్టి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో రూ.4 కోట్లతో చేపట్టిన 25 సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఇప్పటికే పూర్తయిన భవనాలను వినియోగంలోకి తేవాలని, పురోగతిలో ఉన్న వాటిని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన పనులను చేపట్టాలని, అసిస్టెంట్ ఇంజినీర్ల సమక్షంలోనే పనులు జరగాలని, ఇంజినీరింగ్ అధికారులు తరచూ పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ పర్యవేక్షక ఇంజినీర్ జీ.సీతారాములు, జిల్లా పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేవీకే శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 5: జిల్లాలో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగుపర్చాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ సేవలపై మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంతో శనివారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ సేవల పురోగతి ఆశించిన మేర లేనందున మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరించారు. గర్భిణుల నమోదు వంద శాతం జరగాలని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు జరిగేలా ఏఎన్ఎంలు బాధ్యత వహించాలని సూచించారు.
సీ-సెక్షన్ వల్ల కలిగే అనర్థాలను గర్భిణులతోపాటు వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. నిరుడు 19 వేలకు పైగా ప్రసవాలు జరిగితే ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 15 వేలు మాత్రమే నమోదయ్యాయన్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు గర్భిణులను గుర్తించి మొదటి ఏఎన్సీ రిజిస్ట్రేషన్ మొదలుకొని ప్రసవం జరిగే వరకు క్రమం తప్పకుండా మాతా, శిశు సంరక్షణ సేవలను ఆన్లైన్ చేయాలని సూచించారు. వైద్యులు సైదులు, రాజేశ్, సుబ్బారావు, కృపాఉష్రశ్రీ పాల్గొన్నారు.