కూసుమంచి, మార్చి 5: నాడు ఇక్కడి కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. బతుకు దెరువుకు పొరుగు రాష్ర్టాలకూ వెళ్లేవారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆ అవసరం లేకపోయింది. 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, నాగార్జున సాగర్ ద్వారా సాగునీటి విడుదల, భక్త రామదాసు ప్రాజెక్టు, చెరువుల పునరుద్ధరణతో పుష్కలంగా భూగర్భజలాలు, రైతులకు రైతుబంధు, రుణమాఫీ అందుతుండడంతో రాష్ట్రంలో వ్యవసాయం.. పండుగలా మారింది. చిన్న, సన్నకారు రైతులు సైతం దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతానికి వేలాది మంది పొరుగు రాష్ర్టాలకు చెందిన కూలీలు వలస వస్తున్నారు. ఏడాదిలో నాలుగు నెలలపాటు ఇక్కడే ఉండి ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కూసుమంచి పరిసర ప్రాంతాలకు వందలాది మంది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చారు. చెరుకు తోటల్లో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
కూసుమంచి మండల పరిధిలో విస్తారంగా పంటలు పండుతున్నాయి. ఈసారి రైతులు మిర్చి, చెరుకు పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో రైతులు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారికి ముందే అడ్వాన్సులు ఇచ్చి స్థానికంగా వసతి ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడే ఉండి ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కూసుమంచి మండలానికి ఆంధ్రప్రదేశ్లోని తుని, భీమవరం, తణుకు, శ్రీకాకుళం, అనంతపురం, మైలవరం తదితర ప్రాంతాల నుం చి ఎక్కువ మంది వలస వచ్చారు. కొన్నిచోట్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారు పనిచేస్తున్నారు. మిర్చి తోటలను గుత్తాగా తీసుకొని కూలి తీసుకుంటున్నారు. చెరుకు కొట్టేందుకు టన్నుకు రూ.720 చొప్పున కూలి తీసుకుంటున్నారు.
మా ఆంధ్రప్రదేశ్లో సరిగా ఉపాధి దొరకడం లేదు. ఈ కారణంతో తెలంగాణకు వచ్చాం. ప్రస్తుతం చెరుకు కొట్టే పనులకు వస్తున్నాం. టన్నుకు రూ.720 చొప్పున రైతులు ఇస్తున్నారు. రెండు నెలల క్రితం మేం 20 మందిమి ఇక్కడికి వచ్చాం. మా అందరికీ ఇక్కడ ఉపాధి దొరుకుతున్నది. రోజుకు 8 గంటల పాటు పనిచేస్తున్నాం. కూలి గిట్టుబాటు అవుతున్నది.
– రాజు, వలస కూలీ
ఉపాధి కోసం తెలంగాణకు వచ్చాం. ఇక్కడి రైతులు ముందే మాకు అడ్వాన్సులు ఇస్తున్నారు. మేం భరోసాగా ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం. ప్రస్తుతం చెరుకు కొట్టే పనులకు వెళ్తు న్నాం. ప్రతిరోజు 8 గంటలకు పైగా పని చేస్తు న్నాం. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లే వు. పని చేసుకుంటున్నాం. సంపాదించుకుని తి రిగి మా సొంతూరికి వెళ్తాం.
– దాసు, వలస కూలీ
నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చా ను. వలస కూలీగా ఇక్కడ పని చేస్తున్నా. ఇక్కడ పనులు పుష్కలంగా దొరకుతున్నాయి. రోజుకు తక్కువలో తక్కువ రూ.వెయ్యి వరకు కూలి అందుతున్నది. మా రాష్ట్రంలో కూలి దొరకడం లేదు. ఏడాదిలో ఇక్కడే మూడు నాలుగు నెలలు ఉంటాం. పని చేసుకుని తిరిగి స్వరాష్ర్టానికి వెళ్తాం.
– రమేశ్, వలస కూలీ