మణుగూరు రూరల్, మార్చి 5: సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయనున్నది. విద్యార్థులు నాణ్యమైన ఆంగ్ల విద్య అందుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పాఠశాలలో నూతన తరగతి గదులు నిర్మించేందుకు, అధునాతన గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఈ నిర్ణయంపై విద్యార్థుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి ఫీజుల భారం తగ్గుతుందని, తమ పిల్లలు బాగా చదువుకుంటారని వారి తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. ఇదే కోవలో మణుగూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరింత బలోపేతం కానున్నది. ఇప్పటికే దాతలు, పూర్వ విద్యార్థుల సాయంతో పాఠశాలకు మౌలిక వసతులు సమకూరాయి. నియోజకవర్గంలో అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన పాఠశాలగా దీనికి పేరున్నది. ‘మన ఊరు- మన బడి’ అమలైతే ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందనున్నది.
1992లో ప్రారంభమైన మణుగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 32 తరగతి గదులు ఉన్నాయి. నియోజకవర్గంలోనే అత్యధిక విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న పాఠశాలగా దీనికి పేరున్నది. పాఠశాలలో 2008 నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందుతున్నది. ప్రస్తుతం పాఠశాలలో 690 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. వీరిలో 152 మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. ఐదేళ్ల నుంచి పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పాఠశాలకు పట్టణం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచీ విద్యార్థులు వస్తున్నారు. కరకగూడెం, చర్ల, వెంకటాపురం, కొత్తగూడేనికి చెందిన విద్యార్థులూ ఈ బడికి వస్తుండడం విశేషం.
పూర్వ విద్యార్థులు పాఠశాలకు 50 కుర్చీలు, కంప్యూటర్, ప్రింటర్, బీరువా, ఆఫీస్ టేబుల్ అందజేశారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. సుమారు రూ.22వేల నిధులతో పుస్తకాలు, బీరువా సమకూర్చారు. మరికొన్ని రోజుల్లో విద్యార్థులకు మెల్విన్‌జోన్స్ గ్రంథాలయ భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
అన్ని తరగతుల విద్యార్థులకు సర్కారు ఆంగ్ల విద్య అందించాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతర విద్యార్థులతో పోటీపడాలంటే ఆంగ్ల మాధ్యమం తప్పక అవసరం. కానీ కొందరు పేదలు కార్పొరేట్ స్థాయి విద్య అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ బడుల్లా తీర్చిదిద్దాలనుకోవడం శుభపరిణామం.
– బుడగం రామకృష్ణ, పూర్వ విద్యార్థి
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు బలోపేతం కానున్నాయి. ఇప్పటికే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతున్నది. ‘మన ఊరు-మన బడి’ అమలైతే మండల, జిల్లా పరిషత్ పాఠశాలలకు మౌలిక వసతులు అందనున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు మున్ముందు ఎలాంటి పోటీనైనా ఎదుర్కోగలుగుతారు.
– పటేల్ లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయుడు, మణుగూరు జడ్పీ హైస్కూల్