ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 2:‘ కరోనా కారణంగా సుమారు రెండేళ్ల పాటు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యారు. వారు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారు. వారికి మెరుగైన విద్య అందించాలి.. ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెరగాలి.. వాటిని బలోపేతం చేయాలి..’ అనే సంకల్పంతో పనిచేస్తున్నారు కలెక్టర్ వీపీ గౌతమ్. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తరగతులు తిరిగి మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రతిరోజూ జిల్లాలోని ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తున్నారు. విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి తన మార్క్ చూపిస్తున్నారు. ఆయన కృషిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
కరోనా కారణంగాతో విద్యార్థులు చదువులో వెనుకబడిపోయారు. తిరిగి విద్యార్థులు బాగా చదువుకోవాలనే సంకల్పంతో కలెక్టర్ విద్యావ్యవస్థపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా గత నెల 4న, 12 ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. విద్యార్థులను బడులకు రప్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. మండలాల వారీగా హాజరుశాతం తక్కువ నమోదవుతున్న పాఠశాలల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. హాజరుశాతం తక్కువ నమోదవుతున్న మండలాలను గుర్తించి, ఎంఈవోల నుంచి వివరణ తీసుకున్నారు.
కలెక్టర్ ఇప్పటికే రెండుసార్లు వీడియో కాన్పరెన్స్లు నిర్వహించి విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. హాజరుశాతంలో మార్పు తీసుకుని జిల్లావ్యాప్తంగా 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజు నోటీసులు ఇచ్చారు. గతనెల రెండో వారంలో 50 శాతం కంటే తక్కువ హాజరుశాతం నమోదు చేసిన పాఠశాలల యాజమాన్యాలకు వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కన్నెర్ర చేయడంతో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు అలర్ట్ అయ్యారు. బడికి రాని విద్యార్థులను గుర్తించి వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులను పాఠశాలలకు రప్పించారు.
గత నెల 26న ఖమ్మం జిల్లావ్యాప్తంగా విద్యార్థుల హాజరు 82శాతం నమోదు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో జగిత్యాల 78.46 శాతం, మూడో స్థానంలో సిద్దిపేట 77.38శాతాన్ని నమోదు చేసింది. ఇదే నెల 25న ఖమ్మం జిల్లావ్యాప్తంగా 84 శాతం హాజరు, 24న 83.5 హాజరుశాతాన్ని నమోదు చేసింది.
తనిఖీల్లో భాగంగా కలెక్టర్ గౌతమ్ ఏన్కూరులోని కేజీబీవీని సందర్శించారు. అక్కడి టీచర్లు, విద్యార్థినులు ఆడుకోవడానికి స్థలం లేదని చెప్పగానే వెనువెంటనే పక్కనే ఉన్న ప్రకృతి వనంలో ఆడుకునేందుకు వీలు కల్పించారు. పాఠశాల ప్రహరీని పగులగొట్టించి వెంటనే గేటు పెట్టించారు. రఘునాథపాలెం కేజీబీవీని సందర్శించినప్పుడు విద్యార్థులు ఆటస్థలం కోరగా వెంటనే పాఠశాల ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 30లోని 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీంతో విద్యార్థినులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కలెక్టర్ గౌతమ్ కేవలం సాధారణ తనిఖీలతో సరిపుచ్చడం లేదు. పాఠశాలలను సందర్శించినప్పుడు స్వయంగా తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయలు చెప్తున్న పాఠాలు వింటున్నారు. అక్కడితో ఆగకుండా తానే గురువుగా మారి పాఠాలు బోధిస్తున్నారు. స్కూల్, కాలేజీ అనే భేదం లేకుండా విద్యార్థులతో మమేకం అవుతున్నారు. విద్యార్థుల మధ్య కూర్చొని మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. తన రోజువారీ షెడ్యూల్లో తప్పకుండా పాఠశాల సందర్శనను ఒక భాగంగా పెట్టుకున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పాఠశాలల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయుల పనితీరును నిత్యం సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.