ఖమ్మం, మార్చి 2 : తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధులూ దరిచేరవనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఆయా రంగాలకు అధిక నిధులు కేటాయిస్తోంది. నగరంలో చెత్తను తరలించడానికి మరిన్ని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు ఒక లక్ష వరకు గృహాలు ఉంటాయి. మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వచ్చి రోజూ ప్రతి ఇంటి నుంచీ చెత్తను సేకరిస్తారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఖమ్మం కార్పొరేషన్లో రోజుకు దాదాపు 150 టన్నుల చెత్త జనరేట్ అవుతోంది. 60 డివిజన్ల నుంచి ఈ చెత్తను యార్డుకు తరలించడానికి 30 ఆటోలు, 60 ట్రాక్టర్లు ఉన్నాయి.
కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ఆదేశాల మేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వాహనానికీ జీపీఎస్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలో సెప్టిక్ ట్యాంకర్లు-16, వాటర్ ట్యాంకర్లు-6, జేసీబీలు-3, రిప్యూజ్ కంపాక్టర్లు-2, స్వీపింగ్ మెషిన్లు-4, ఆటోలు-30, ట్రాక్టర్లు-60 ఉన్నాయి. వీటిలో ఆటోలు, ట్రాక్టర్లకు మినహా మిగిలిన అన్ని వాహనాలకు జీపీఎస్ అమర్చారు. దీంతో ఏ వాహనం, ఎక్కడ ఉందో అధికారులు తెలుసుకునే వీలు కలుగుతున్నది. తద్వారా సమయపాలన, వాహనాలు విధుల్లో ఉన్నాయో లేవో తెలిసిపోతున్నది.
ఖమ్మం కార్పొరేషన్లో పలు ప్రభుత్వ వాహనాలను వివిధ పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటిలో కొన్ని ప్రభుత్వ వాహనాలు, మరికొన్ని ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. వాహనాలను నడిపే డ్రైవర్లు కొన్నిసార్లు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తుండడంతో సమయం వృథా అవుతోంది. దీనికితోడు కార్పొరేషన్‌కు అదనపు భారం పెరుగుతోంది. కేఎంసీలో ఉపయోగించే జేసీబీలు, సెప్టిక్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలు నడిపే వారు పలు సందర్భాల్లో పనులు చేయకుండా సాకులు చెపుతూ గడుపుతున్నారు. నిర్దేశించిన సమయంలో వెళ్లి రావాల్సిన వాహనాలు ఆలస్యమవుతున్నాయి. డ్రైవర్లు ఆ వాహనాలను మార్గంమధ్యలో నిలుపుదల చేసి పనులు చేయకుండా సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనిని గమనించిన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల వాహనాలకు జీపీఎస్ మెషిన్లు అమర్చాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం నగరంలోని సెప్టిక్ ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు, జేసీబీలు, క్లీనింగ్ యంత్రాలు, కంపాక్టరీ యంత్రాలకు ఇటీవల జీపీఎస్ అమర్చారు. మిగిలిన ఆటోలు, ట్రాక్టర్లకు సైతం టెండర్ ద్వారా జీపీఎస్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ రకాల పనులకు వినియోగించే వాహనాలను నడిపే వ్యక్తులు విధుల్లో అలసత్వం వహిస్తున్నట్లు గుర్తించాం. నగరంలోని 60 డివిజన్లలో రోజూ తిరుగుతుండడంతో ఏ వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కుదరదు. కాబట్టి ప్రతి వాహనానికీ జీపీఎస్ యంత్రం అమర్చాం. దీంతో ఏ వాహనం ఏ సమయంలో ఎక్కడ ఉందో అనే విషయం కార్యాలయంలో ఉండే తెలుసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా వాహనాలు సక్రమంగా వినియోగమవుతాయి.
-ఆదర్శ్ సురభి, కమిషనర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్