ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ప్లాస్టిక్‌తో దుష్పరిణామాలు తలెత్తుతుండడంతో నిషేధం విధించింది. పంచాయతీలను ప్లాస్టిక్ రహిత పల్లెలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నది. అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నది. గతంలో మున్సిపాల్టీలకే పరిమితమైన ప్లాస్టిక్ నిషేధాన్ని ఇప్పుడు పల్లెల్లోనూ పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పల్లెల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఖమ్మం జిల్లాలో 589 పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 389 పంచాయతీలు ఉన్నాయి. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించడంతో గ్రామాల్లో సత్ఫలితాలొస్తున్నాయి. వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లు అందజేస్తున్న దుకాణాదారులకు రూ.500 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తున్నది. పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అంతేకాదు, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి తరలించేందుకు ఏజెన్సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాలకవర్గాలు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిత్యజీవితంలో ప్లాస్టిక్ వినియోగం అంతర్భాగమైపోయింది. మనకు తెలియకుండానే ప్లాస్టిక్‌ను ఇంటికి ఆహ్వానిస్తున్నామని మనలో ఎంతమందికి తెలుసు.. ఉదయం ఇంటికి వచ్చే పాల ప్యాకెట్ నుంచి జొమాటోలో ఆర్డర్ వరకు, షాపింగ్ మాల్ నుంచి ఇంటికి తెచ్చే వస్తువుల వరకు.. అన్నింటినీ మోసేవి ప్లాస్టిక్ కవర్లే. అంతేనా.. కూల్‌డ్రింక్ బాటిల్స్, సోడా సీసాలు, నీళ్ల సీసాలు, పాలిథిన్ కవర్లు, కప్పులు, టీ గ్లాసులు.. ఇలా ఒక్కటేంటి జీవితంలో ప్లాస్టిక్ వినియోగించని రోజు ఉండదేమో.. ఇలా ఒక్క భారతదేశంలోనే ఏడాదికి 5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి.. ఒక ప్లాస్టిక్ కవర్, ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంటే మరి ఈ ఏడాది విడుదలైన 5 మిలియన్ల టన్నుల వ్యర్థాలు ఎప్పటికి భూమిలో కలవాలి? మరి మరుసటి సంవత్సరం వ్యర్థాలు? అంతకుముందు సంవత్సరం విడుదలైన వ్యర్థాల సంగతేంటి? ఇలా ఆలోచిస్తే కళ్ల ముందు ప్లాస్టిక్ వినాశనం కనిపిస్తుంది కదూ.. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే వ్యర్థాలు అన్నీ ఇన్నీ కావు.
ప్లాస్టిక్ నేల, నీటిలో ఉన్నప్పుడు కొన్ని హానికారక రసాయనాలను విడుదల చేస్తుంది. దీంతో నీటి వనరులు కలుషితమవుతాయి. భూమి సారవంతాన్ని కోల్పోతుంది. జలచరాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. జీవులకు క్యాన్సర్ ముప్పు తెస్తుంది. మానవాళికి నాడి సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతలు కలుగజేస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించింది. గ్రామాలు, పట్టణాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ఖమ్మం జిల్లాలో 589 పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 389 పంచాయతీలు ఉన్నాయి. ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం విధించడంతో గ్రామాల్లో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రజలు క్లాత్ సంచులు, నార సంచుల వినియోగాన్ని పెంచారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే సంచులు తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ నివారణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నది. వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లు అందజేస్తున్న దుకాణాదారులకు రూ.500 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ఒక నగరపాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల నిషేధం పకడ్బందీగా అమలవుతున్నది. పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి తరలించేందుకు ఏజెన్సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాలకవర్గాలు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఏజెన్సీలు ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు, ఇనుప సామగ్రి, ఖాళీ సీసాలను సేకరించాల్సి ఉంటుంది. ఏజెన్సీల ద్వారా పంచాయతీలు అదనపు ఆదాయం సమకూర్చుకునేలా సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. అధికారులు ఇప్పటికే పాలకవర్గాలకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.
పంచాయతీలను ప్లాస్టిక్ రహిత పల్లెలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే పల్లెల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగింపజేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులకు జరిమానా విధిస్తున్నాం.
– హరిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం