ఖమ్మం, జూన్ 20 : (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : ఖమ్మం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ బీ రాంబాబు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం డీహెచ్ గడల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 14న ఖమ్మం జిల్లాలో వైద్యారోగ్యశాఖ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
మంత్రి అజయ్‌కుమార్ సైతం వేడుకలకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యారోగ్యశాఖ దినోత్సవ వేడుకలు పెద్దఎత్తున జరిగాయి. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. వాటిని తీసుకోకుండానే వేడుకలు నిర్వహించడం, వాటి ఖర్చులు వైద్యులు, ఇతర సిబ్బందికి అప్పగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారన్న కారణంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో రాంబాబును సస్పెండ్ చేశారు.