ముదిగొండ, ఏప్రిల్ 22 : తమాషా కోసం మీటింగ్ పెట్టుకున్నామా రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ధాన్యం కొనుగోలుపై పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసింది రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండటానికనీ అయినా సరైన ఏర్పాట్లు చేయలేదనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో బొర్డు ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ టార్పాలిన్ పట్టాలు, గన్నీ బ్యాగులు ఎన్ని ఉన్నాయో వివరాలు ఉంచాలన్నారు. దానికి తగ్గట్లు రైతు ధాన్యం తీసుకొస్తాడని తెలిపారు.
రైతులతో మాట్లాడగా తేమశాతం వచ్చినా కాటాలు వేయట్లేదని, లోడ్లు ఎత్తడం లేదని వాపోయారు. సిబ్బందిని ప్రశ్నించగా మండల పరిధిలోని సువర్ణపురంలో ఉన్న సత్యసాయి రైస్ మిల్ ధాన్యం తీసుకోవట్లేదని అందుకే ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. కారణం అడగగా 16:38 రకం ధాన్యాన్ని తీసుకోవడం లేదని ఇవి దొడ్డు రకం బియ్యం అని అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే తాము పంట వేశామని ఇప్పుడు ఇలా అనటం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో కలెక్టర్ మాట్లాడగా విషయం తమ దృష్టికి వచ్చిందని మిల్లర్లతో మాట్లాడుతున్నామనీ ఎఫ్సీఐ వాళ్లు ఈ ధాన్యాన్ని సన్నరకంగా పరిగణించట్లేదని మిల్లర్లు అంటున్నారని, అందుకే తీసుకోవటం లేదని మిల్లర్లు తెలిపినట్లు చెప్పారు. కాగా రైతులని ఇబ్బంది పెట్టడం ఏంటని ఈరోజు సాయంత్రం కల్లా ధాన్యం తీసుకుంటారో లేదో చెప్పాలని, ఒకవేళ తీసుకోకపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకోండని ఆదేశించారు. ఒకరిద్దరు మిల్లర్లు ధాన్యం తీసుకోనంత మాత్రాన ఏమీ కాదని వేరే మిల్లుకు ఎలాట్ చేయాలని అన్నారు.
మేము మిల్లు వద్దకు వెళితే 5 కేజీలు కట్ చేసుకుని తీసుకుంటామని లేకపోతే తీసుకోమని చెప్తున్నారు అని రైతులు చెప్పగా, రైతు మిల్లు వద్దకు ఎందుకు వెళ్లాలని అధికారులు ఏం చేస్తున్నారని, రైతు మిల్లు వద్దకు వెళితే మన వ్యవస్థ ఫెయిల్ అయినట్లేనని అన్నారు. ఐకెపి సెంటర్లో 5 కేజీల తరుగుకి ఒప్పుకుంటేనే కాటా వేస్తామని అంటున్నారని రైతులు తెలిపారు. సిబ్బందితో మాట్లాడగా మిల్లర్లు ధాన్యం తీసుకోవటం లేదని, పంపించిన ధాన్యాన్ని ఎన్ని రోజులైనా అన్లోడ్ చేయటం లేదనీ, ఐదు కేజీలు కటింగ్ పెడితేనే తీసుకుంటామని అంటున్నారనీ అందుకే రైతులకి చెప్తున్నామని ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని తెలిపారు. ఈ విషయంపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ తెలిపారు. సన్న వడ్ల కింద దాన్యం పరిగణించకపోతే మాకు బోనస్ రాదని రైతులు తెలుపగా అన్ని విషయాలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ సునీత ఎల్జెబిత్, ఏఓ వేణు, ఆర్ఐ వహీద పాల్గొన్నారు.