మామిళ్లగూడెం, మే 30: జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సీపీ సునీల్‌దత్‌తో కలెక్టరేట్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానలు కురిసిన తరువాత జూన్ రెండో వారం నుంచి విత్తనాలు నాటే అవకాశం ఉండడంతో రైతులు ముందు నుంచే వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు సరిపడా విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.
ఇప్పటికే వారం క్రితం జిల్లావ్యాప్తంగా విత్తన డీలర్లు, వ్యాపారులతో సమావేశం నిర్వహించామని, రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించామని తెలిపారు. జిల్లాలో నిరుడు పచ్చిరొట్ట విత్తనాలు 20,370 క్వింటాళ్లు అమ్మకాలు చేశామని, ఈ ఏడాది అవసరాలకు 21,276 క్వింటాళ్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటివరకు 14,114 కింటాళ్లు జిల్లాకు చేరుకోవడంతో 11,123 క్వింటాళ్లను 60 శాతం సబ్సిడీతో రైతులకు అందించామన్నారు. ఇంకా 2,990 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 7,209 క్వింటాళ్లు జిల్లాకు చేరుకుంటున్నాయని వివరించారు. రైతులు పచ్చిరొట్ట విత్తనాలను సొసైటీల ద్వారా తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోందని కలెక్టర్ తెలిపారు. నిరుడు 18,7687 ఎకరాల్లో పత్తి సాగైందని, ఈ ఏడాది 20,1834 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన 44,9347 పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఎకరానికి రెండు ప్యాకెట్లు సరిపోతాయన్నారు. బీజీ 11 వెరైటీలో అన్నిరకాల విత్తనాలు సమాన దిగుబడిని ఇస్తాయని రైతులు గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని కంపెనీల హైబ్రీడ్ విత్తనాలు ఒకేరమైన పంట దిగుబడి ఉంటుందని, ఎకరానికి సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తుందని తెలిపారు. దీనికి వాతావరణ అనుకూలతలు, నేల రకం, నీటివసతి, రైతు యాజమాన్యం వంటివి ఆధారపడి ఉంటాయని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 శాతం పత్తి విత్తనాలు మాత్రమే విక్రయించామని, ఇంకా 90 శాతం విత్తనాలు డీలర్లు, వ్యాపారుల వద్ద సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలు, సరఫరాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి లూజుగా విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసిన కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ పాల్గొన్నారు.