మామిళ్లగూడెం, డిసెంబర్ 3 : జిల్లాలో మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదలతో అన్ని శాఖల పరిధిలో రూ.672.78 కోట్ల నష్టం వాటిల్లిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాకు వచ్చిన వరద నష్టం అంచనా నిపుణుల బృందానికి వరద తీరు, చేపట్టిన చర్యలు, నష్టం వివరాలను మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించామని తెలిపారు. వరదల వల్ల 15,258 ఇండ్లు దెబ్బతిన్నాయని, ఇంటికి జరిగిన నష్టానికి రూ.16,500 చొప్పున లబ్ధిదారులకు పరిహారంగా చెల్లించినట్లు తెలిపారు. సీబీఆర్ఐ డైరెక్టర్ ఆర్.ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ 17 మందితో కూడిన సభ్యుల బృందం పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ కోసం వచ్చినట్లు తెలిపారు.
నష్టం ఎంత జరిగింది? రికవరీ ఎంత అవసరం? పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? అని అంచనా చేయడానికి వచ్చినట్లు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారుల నుంచి నష్టం వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మూడు నెలల క్రితం జిల్లాలో కురిసిన వర్షాలు, వరదలతో జరిగిన నష్టం తీరును తెలుసుకునేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్(విపత్తు నిర్వహణ) కేంద్ర, రాష్ట్ర బృందం సభ్యులు జిల్లాలో మంగళవారం పర్యటించారు. తొలుత బృందం సభ్యులు కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాలు, అధికారులు చేపట్టిన సహాయక చర్యల గురించి బృందం సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారీ వర్షాలతో ఏడు ముంపు ప్రభావిత మండలాల్లో పంట నష్టంతోపాటు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థ గురించి ప్రాంతాలవారీగా వివరించారు. వరదల సమయంలో సహాయక చర్యల కోసం భారీ డ్రోన్లు, పుట్టీలు, పడవలు, ఇతర పరికరాలను వినియోగించినట్లు తెలిపారు. బృందంలో ప్రవీణ్, శ్రీనివాస చారి, ఐశ్వర్య, రవిపాల్, అథికలాం, సాయిబాబా, ప్రదీప్‌కుమార్, వరుణ్, మోతీలాల్, శ్రీనివాస్ ఉన్నారు.