ఖమ్మం, ఫిబ్రవరి 11: జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పోలింగ్ సిబ్బంది పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ఈ ప్రక్రియలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 577 గ్రామ పంచాయతీలు, 5,266 వార్డుల పరిధిలో మొత్తం 5,284 పోలింగ్ కేంద్రాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పీవో, ఏపీవోలను నియమించాలన్నారు. 20 శాతం బఫర్‌తో కలిపి పోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం కేటాయించిన ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. డీపీవో ఆశాలత, ఆర్డీవోలు నరసింహారావు, ఎల్.రాజేందర్, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగ పద్మజ, డీఎల్పీవో రాంబాబు పాల్గొన్నారు.