Muzammil Khan IAS | ముదిగొండ ఫిబ్రవరి 11: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా పర్యటించి రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మా గ్రామ పరిధిలోని ఆంధ్రాబ్యాంక్ సొసైటీ పరిధిలో రైతులకు రుణమాఫీ అవ్వలేదని కలెక్టర్‌తో రైతులు చెప్పగా.. ఆయన అక్కడే ఉన్న వ్యవసాయ అధికారులను వివరణ అడిగారు. మీ డబ్బులు రాకపోతే ఇలానే ఊరుకుంటారా..? అని మండల వ్యవసాయ అధికారి, ఏఈఓని ముజామిల్ ఖాన్ మందలించారు.
ఆ బ్యాంకుకు సంబంధించిన ఆడిట్లో లోపాలు ఉండటం వల్ల రాలేదని ఇప్పటికే పలుమార్లు బ్యాంకు దృష్టికి తీసుకెళ్లామని వారు వివరించారు. కలెక్టర్ దానికి బదులిస్తూ ఇప్పటికే ఆ బ్యాంకుకు మనం లిస్టు పంపించమని చెప్పాము.. అయినా ఎందుకు పంపించలేదో కనుక్కోమని తన సిబ్బందిని ఆదేశించారు. మీరు నా దృష్టికి తీసుకురావాల్సింది కదా రుణమాఫీ గురించి మనం రెండుసార్లు కలిసి చర్చించాము.. అయినా నాకు ఎందుకు చెప్పలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బ్యాంక్ మేనేజర్‌ను రేపు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వమని ఆదేశించారు.
తరువాత వరి పంటను పరిశీలించిన కలెక్టర్ ముజామిల్ ఖాన్ పొలం గట్టుపై నడిచి పంటను పరిశీలించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గుడి ఆవరణలో కూర్చొని రైతులు, గ్రామస్తులతో మాట్లాడి పలు సమస్యలపై చర్చించారు. కొన్ని సమస్యలను తన పీఏకి చెప్పి నోట్ చేసుకోమన్నారు. మరికొన్ని సమస్యలను స్థానిక అధికారులకు చెప్పి వీటిని పరిష్కరించి సంబంధిత ఫైల్ తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఏఓ వేణు, ఆర్ఐలు వహీదా, ప్రసన్నకుమార్, ఏఈఓ మౌనిక ఇతర అధికారులు రైతులు పాల్గొన్నారు.
Mancherial | కోనూర్‌లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు