మధిర, మే 8: ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించడంతోపాటు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, లేబర్ రూమ్, రేడియాలజీ బ్లాక్, ఓపీ విభాగాలను కలియతిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి.. వారికి అందుతున్న వైద్య సేవలు, భోజన నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల జబ్బులకు ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని, రోగులు బయటకు వెళ్లి కొనుగోలు చేసే విధంగా ఉండొద్దన్నారు. అంతకుముందు మధిరలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్, రూ.4 కోట్లతో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సిరిపురం గ్రామంలో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల, ఐటీఐ భవనం, ఏఐటీసీ సెంటర్ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిర్మాణ పనుల విషయంలో రాజీ పడొద్దని, గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాంబాబు, విద్యాశాఖ ఇంజినీరింగ్ అధికారి బుగ్గయ్య, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది ఉన్నారు.