మామిళ్లగూడెం, ఫిబ్రవరి 23: పాలనా అంశాల పట్ల అధికారులు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లిలో అటవీ వస్తువుల విక్రయం కోసం ప్రత్యేకంగా మార్ట్ నిర్మాణానికి గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున రూ.10 లక్షల మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. నేలకొండపల్లి, ధంసలాపురం, వెంకటగిరి వద్ద ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లపై రిపోర్టు అందజేయాలని ఆదేశించారు.
రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పురోగతిపై రెగ్యులర్గా రిపోర్టు అందించాలన్నారు. భూసేకరణ పెండింగ్ కోర్టు కేసులకు సకాలంలో కౌంటర్ వేయాలని సూచించారు. వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలను ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఈనెల 27న జరిగే దిశా కమిటీ సమావేశానికి అధికారులందరూ పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరుకావాలని సచించారు.
ఏఐ వినియోగం ద్వారా మెరుగైన పనితీరు
ఏఐ సాంకేతికత క్లౌడ్ వినియోగం ద్వారా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ‘పరిపాలనలో ఏఐ సాంకేతికత’ అనే అంశంపై కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో అధికారులకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, జడ్పీ సీఈవో దీక్షా రైనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.