మామిళ్లగూడెం, జూలై 7 : జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యాశాఖ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద వాటిని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రసుత్తం ఉన్న రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే, మధిరలో జీ ప్లస్ 2 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం 13 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. అక్కడ 427 ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. గుడిసెల్లో ఉంటున్న పేదలకు ఇళ్లలో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇందిరా డెయిరీ కింద అవసరమైన షెడ్లను ఉపాధి హామీ కింద నిర్మించాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో దీక్షారైనా, హోసింగ్ పీడీ శ్రీనివాస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రూపొందించిన సమగ్ర సమాచార సంపుటికను అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు.
పోర్చుగల్లో ఉపాధి అవకాశాల కోసం అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. దరఖాస్తులను tomcom.resume@ gmail. comకు మెయిల్ చేయాలని, పూర్తి వివరాలకు 94400 52592, 9440049937, 9440051452 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ప్రజావాణిలో అందించిన దరఖాస్తుకు స్పందించిన కలెక్టర్ అనుదీప్.. సంబంధిత లబ్ధిదారుకి అల్లిపురంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించి సమస్యను పరిష్కరించారు. ఖమ్మం ముస్తాఫానగర్కు చెందిన తుపాకుల శైలజకు 2022లో వైఎస్ఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా అప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఆమె ఇల్లు తీసుకోలేకపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఆమె వినతి అందించగా.. కలెక్టర్ స్పందించి ఖమ్మం అర్బన్ తహసీల్దార్ ద్వారా అల్లీపురం డబుల్ బెడ్రూం ఇళ్లలో జీ1 ఇంటిని కేటాయించారు.