ఖమ్మం, అక్టోబర్ 15 : రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం 46వ డివిజన్ సారథిగర్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.కోటితో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్నేరు వరద నుంచి మరోసారి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ డిజైన్ కోసం నిపుణుల కమిటీని నియమించాలని ముఖ్యమంత్రిని కోరామని, భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు.
ఆక్రమణలో ఉన్న పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలు మరోచోట అందించి.. వారిని అక్కడి నుంచి తరలించిన తర్వాతే ఆక్రమణలను తొలగించాలని మంత్రి సూచించారు. ఖమ్మం నగరానికి అవసరమైన నిధులు ముఖ్యమంత్రిని అడిగి తీసుకొస్తానని, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.