మామిళ్లగూడెం, సెప్టెంబర్ 18 : ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకారం అందించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, దీని ప్రకారంగా ఈ నెల 13న వార్డులవారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఇందులో అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈ నెల 21 లోపు సంబంధిత ఎంపీడీవోలకు లిఖితపూర్వకంగా సమర్పించాలని, 26 లోపు అభ్యంతరాలను పరిష్కరించి 28న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరికి ఒకే వార్డులో ఓట్లు ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీపీవో ఆశాలత, డీఎల్పీవో రాంబాబు, బీఎస్పీ నుంచి బుర్రా ఉపేందర్, సీపీఎం నుంచి ఎన్.వీరబాబు, నవీన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి గోపాల్‌రావు, టీడీపీ నుంచి కృష్ణాప్రసాద్, సీపీఐ నుంచి తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నుంచి ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.