గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం మలి పోరు జరగనుంది. రెండో విడతలో భాగంగా ఆయా పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం రాత్రే పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తీసుకొని బస్సుల్లో ఆయా పంచాయతీ పోలిం గ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొన్నటి వరకు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించిన ఆయా సర్పంచ్ అభ్యర్థులు తమ భవితవ్యం ఎలా ఉండనుందోనని తెగ ఆందోళన చెందుతున్నారు. క్షణ క్షణం.. నరాలు తెగే ఉత్కంఠతో ప్రజలు సైతం తమ గ్రామ ప్రథమ పౌరుడు ఎవరనే దానికోసం ఎదురుచూస్తున్నారు.
– ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 13
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు మండలాలు అశ్వారావుపేట, చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, పాల్వంచ, చుంచుపల్లిలో 138 గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 8 మండలాల్లో ఎన్నికలు పూర్తికాగా.. రెండో విడతకు అధికారులు సిద్ధమయ్యారు. ఏడు మండలాల్లో 156 పంచాయతీలు ఉండగా.. అందులో ఒక పంచాయతీకి నామినేషన్ రాకపోవడం, ములకలపల్లి మండలంలో ఒక పంచాయతీకి కోర్టు అభ్యంతరంతో ఎన్నికలు నిలిచిపోవడంతో మిగిలిన 154 పంచాయతీలకు నోటిఫికేషన్ వేశారు. అందులో 16 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం 138 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 386 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు మండలాల్లో 1,384 వార్డులు ఉండగా.. 1,123 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనుండటంతో 2,820 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,671 మంది పీవోలు, 2,031 మంది వోపీవోలు విధుల్లో ఉన్నారు. అదనంగా కొంతమందిని రిజర్వులో ఉంచారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు పంపిణీ కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేసి అధికారులకు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది..
ఎన్నికల అధికారులు ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి ఆయా పంచాయతీల పోలింగ్ కేంద్రాలకు నిన్న రాత్రికే సిబ్బంది చేరుకున్నారు. రాత్రికి రాత్రే పోలింగ్ సిబ్బంది వాళ్లకు ఇచ్చిన మ్యాప్ ప్రకారం బూత్‌ల గదులను ఏర్పాటు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు వారికి కావాల్సిన వసతులను కల్పించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేయడంతో సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో మెటీరియల్‌ను తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ కేంద్రాలకు సురక్షితంగా చేరారు.
సాయంత్రంకల్లా ఫలితాలు..
రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పోలింగ్ జరుగుతుంది. ఒంటిగంట తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రంకల్లా ఫలితాలను వెల్లడిస్తారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో తక్కువ మంది ఓటర్లు ఉండటంతో తొందరగానే ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో విడత పోరుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీఆర్ఎస్కు అనేక గ్రామాల్లో అనుకూల వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుండటంతో ఇరుపార్టీలు మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశాలు ఏర్పడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలో ఆరు మండలాలు కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల పరిధిలో ఉన్న 183 గ్రామ పంచాయతీలు, 1,686 వార్డులకు రెండో విడత ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించారు. ఒక్క వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదు, 23 గ్రామ పంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 160 గ్రామ పంచాయతీలకు మొత్తం 451 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,379 వార్డులకు 3,352 మంది వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు, 1,831 మంది పోలింగ్ అధికారులు, 2,346 మంది వోపీవోలు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రెండో విడతలో 28 లొకేషన్స్‌లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2,51,327 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,164 మంది పురుషులు, 1,30,156 మంది మహిళలు, ఏడుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.

ఓటర్లు లేని ఊరిలో ఓట్లు!
పంచాయతీ పేరు : వెంకటేష్ ఖని
మండలం : చుంచుపల్లి
కుటుంబాలు : 79
ఓటర్లు : 183
పోలింగ్ కేంద్రాలు : 4
ఎన్నికల సిబ్బంది : 12 మంది
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేష్ ఖని గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఓటర్లు లేకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో శనివారం రాత్రి ఎన్నికల సిబ్బంది బస చేశారు. వివరాల్లోకెళ్తే.. సింగరేణి ఓసీ విస్తరణలో వెంకటేష్ ఖని గ్రామం కనుమరుగైంది. ఊరిలో 79 కుటుంబాలు ఉండగా.. 183 మంది జనాభా.. 179 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓపెన్‌కాస్టు ద్వారా బొగ్గు వెలికితీత కోసం సింగరేణి ఓసీ ఏర్పాటు చేయబోతున్న క్రమంలో అధికారులు మూడేళ్ల క్రితమే ఆ ఊరి ప్రజలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. దీంతో చాలామంది తలోదారి చూసుకున్నారు.
కానీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొందరు రాజకీయ నాయకులు ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తులను రప్పించి నామినేషన్లు వేయించారు. సర్పంచ్ స్థానానికి ముగ్గురు, 4 వార్డులకు 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆదివారం జరుగనున్న పోలింగ్‌కు ఎంతమంది వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటారనేది వేచిచూడాల్సిందే. ఇదిలాఉంటే ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా రాత్రంతా భయంభయంగా గ్రామంలో గడిపారు.