శ్రీరాంపూర్, నవంబర్ 23: కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు..బీజేపీవస్తే గనుల ప్రైవేటీకరణ తప్పదని, సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేసే జాతీయ పార్టీకే సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీరాంపూర్ ఆర్కే 5బీ గనిపై టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కలిసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఐటీ రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని చెప్పారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఐటీ రద్దు చేయాల్సింది పోయి, ఉన్న గనులను ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. అందుకే కేంద్రంలో ఏపార్టీ ప్రభుత్వం వచ్చినా ఐటీ రద్దుకు స్పష్టమైన హామీ ఇస్తేనే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలుంటాయని, బీజేపీ ప్రభుత్వం వస్తే గనులు ప్రైవేట్ చేస్తుందని ఆరోపించారు.
కార్మికులు పోరాడి ప్రైవేటీకరణను అడ్డుకున్నారని చెప్పారు. రైతుల వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెడుతారన్నారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా హక్కులు కల్పించారన్నారు. సకలజనుల సమ్మె వేతనాలు ఇచ్చారని చెప్పారు. 16 నుంచి 32 శాతంకు లాబాల వాటా పెంచారన్నారు. కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు కల్పించరన్నారు. దాంతో వేల మందికి ఉద్యోగాలు దొరికాయన్నారు. కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి దివాకర్‌రావును గెలిపించాలని కోరారు. కార్మికులకు కేసీఆర్, టీబీజీకేఎస్ 100 హక్కులు కల్పించిందన్నారు. ఈ నెల 24న నస్పూర్‌లో జరిగే కేసీఆర్ సభకు కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కేం ద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు కాశీరావు, వెంగళ కుమారస్వామి, పెట్టం లక్షణ్, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, కానగంటి చంద్రయ్య, పిట్ కార్యదర్శులు సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, నాయకులు నీలం సదయ్య, బత్తుల గోపాల్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, నవంబర్ 23 : శ్రీరాంపూర్ ఏరియా సింగాపూర్, తాళ్లపల్లి మహర్శి పద్మశాలీ సంఘం గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శ్రీరాంపూర్ ఆర్కే 6 గుడిసెల్లోని ఆర్ఎంపీ, పీఎంపీ కార్యాలయంలో మహర్శి పద్మశాలీ సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఏక గ్రీవంగా తీర్మానం చేసి ఎమ్మెల్యే దివాకర్‌రావుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు జక్కెన రాజేందర్, కార్యదర్శి తౌటం సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ కోల్‌బెల్ట్ శ్రీరాంపూర్ తాళ్ళపల్లి, సింగాపూర్ పద్మశాలీ సంఘం భవన నిర్మాణానికి నిధులు, స్థలం మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. గతంలోని సంఘం భవనం జాతీయ రహదారి విస్తరణలో కోల్పోయినట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం నుంచి, లేదా ప్రభుత్వ పరంగా సంఘం కార్యాలయం కోసం స్థలం ఇవ్వడానికి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు జక్కెన రాజేందర్ మాట్లాడుతూ తమ కులసంఘం అన్ని విధాలా చర్చించి బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే దివాకర్‌రావుకు మద్దతు ఇస్తామని, గెలిపించేందుకు ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కుంట రామన్న, కోశాధికారి మోరె విద్యాసాగర్, నాయకులు సదానందం, సుంకెనపెల్లి రమేశ్, మొండయ్య, రామానుజం, దశరథం, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.