“ ‘రైతుబంధు’వయ్యావు.. రైతుబీమాతో ధీమా అయ్యావు.. బీడుబారిన భూముల్లో జలసిరులు కురిపించావు.. చెరువుల మత్తడికి చిరునామా నీవు.. మొత్తానికి రైతును రాజును చేశావు. తరతరాల కరువును తరిమేశావు.. ఇంటింటికీ తాగునీరు అందించావు.. విరామం లేకుండా విద్యుత్ వెలుగులు విరజిమ్మావు.. వృద్ధులకు ‘ఆసరా’గా నిలిచావు.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి కోసం ‘కల్యాణలక్ష్మి’ అందించి పెద్దన్న బాధ్యతను మోశావు.. సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేర్చారు.. మీ ప్రతి ఆలోచనా అద్వితీయం.. ఆచరణ వినూత్నం.. అమలు విప్లవాత్మకం.. వెరసి మీ పదేళ్ల పాలన ఓ స్వర్ణయుగం అంటూ ప్రతి నోరూ కేసీఆర్‌ను కొనియాడింది. ఆయన జన్మదినం సందర్భంగా నాయకా.. వెయ్యేళ్లు వర్ధిళ్లు అంటూ చేతులెత్తి దీవించారు. ”
తెలంగాణ దివిటీ, ఉద్యమ కెరటం, రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన సంబురాలు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా కేక్‌లు కట్ చేసి పటాకులు కాల్చారు. స్వీట్లు పంచారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వృక్షార్చన, సేవా కార్యక్రమాల్లో భాగంగా భారీఎత్తున మొక్కలు నాటారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంచారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అన్నదానాలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ ఆవరణలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ పారులో మూడు మొకలు నాటారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు కేక్ కట్ చేశారు. మొకలు నాటారు. కార్యాలయం మొత్తం గులాబీ రంగు బెలూన్లతో అలంకరించారు. కువైట్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు, ఖమ్మం జిల్లావాసి గొడిషాల అభిలాష ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఖమ్మంరూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు మాలోతు భాస్కర్ తన మిర్చికల్లంలో ఎండుమిర్చితో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ అని అక్షరాలుగా పేర్చి నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. పాల్వంచలోని పెద్దమ్మతల్లి ఆలయంలో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులు పూజలు చేశారు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ కట్ చేశారు. దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఏన్కూరులో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, మధిరలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కొత్తగూడెంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మపర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు.
– ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)