భద్రాచలం, నవంబర్ 4 : కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదీ తీరం దీపపు కాంతులతో మురిసిపోయింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్డున భక్తిశ్రద్ధలతో ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. వాటిని గోదావరిలో వదిలి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులతోపాటు నవదంపతులు, అయ్యప్ప దీక్షాపరులు పెద్ద ఎత్తున గోదావరి తీరానికి చేరుకోవడంతో పులకించిపోయింది.
అలాగే సీతారామచంద్రస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శివాలయానికి చేరుకున్న మహిళలు కార్తీక పూజలు చేసి దీపాలు వెలిగించారు. అర్చకులు ప్రత్యేకంగా భస్మంతో అభిషేకం నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు కార్తీక పూజల అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
కార్తీక మాసంలో తొలి సోమవారం కావడంతో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో రమాదేవి, అర్చకులు పవిత్ర గోదావరి నదీ తీరంలో గోదారమ్మకు నదీ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీందర్, ఏవో భవానీకృష్ణ, ఆలయ సూపరింటెండెంట్ సాయిబాబా, ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.