భద్రాచలం, నవంబర్ 2 : కార్తీక మాసం సందర్భంగా భద్రాద్రి రామాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి నదీ తీరంలో భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించారు. సమీప ఉప ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, అంబాసత్రంలోని శివాలయంతోపాటు పట్టణ పరిధిలో గల పలు ఆలయాల్లో మహిళలు పూజలు చేశారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి అభిషేకాలు చేశారు.
నూతన దంపతులు సైతం నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. దీంతో రామాలయ పరిసరాల్లో ఎటుచూసిననా భక్తుల సందడే కనిపించింది. శివాలయంలో& దేవస్థాన అనుబంధ ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ భక్తులు కార్తీక మాసం సందర్భంగా దీక్షలు చేపట్టగా వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు.