కారేపల్లి, మార్చి 3: ఖమ్మం (Karepalli) జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా 38 సర్వేనంబర్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు తహసిల్దార్ సంపత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. అదేవిధంగా బీసీ విద్యార్థుల వసతి గృహం, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఐసీడీఎస్ కార్యాలయాలు కిరాయి భవనాలలో కొనసాగుతున్నాయని చెప్పారు.
అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేలా కృషి చేయాలన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులతో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి వివరిస్తామని వెల్లడించారు. వినతి పత్రం అందజేసిన వారిలో తురగా నారాయణ, ఆదెర్ల శంకర్, పొలగాని శ్రీనివాసరావు, తురక రాంబాబు, కేటిమల్ల శ్రీనివాస్, ఆరెళ్ల రవి, జూపల్లి వెంకన్న, పాలిక రమేష్, నాగేశ్వరావు గౌడ్, తురగా రవి, తొగర రాంబాబు, షేర్ ఖాన్ తదితరులు ఉన్నారు.