ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 9 : మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదులాపురం ప్రజలు ఇచ్చే తీర్పు కనువిప్పు కావాలని, ఇక్కడ బీఆర్ఎస్, సీపీఎం కూటమి జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ మార్పు అనే పదాన్ని ఉపయోగించిందని, నిజమైన మార్పు రావాలంటే బీఆర్ఎస్, సీపీఎం కూటమి ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్‌తో కలిసి ఏదులాపురంలో సోమవారం రోడ్ షో నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. బీటీ రోడ్డు, శ్మశాన వాటిక, పల్లె దవాఖాన వంటి నిర్మాణాలు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి తాను సహాయం చేశానని, రాజకీయాలకతీతంగా పని చేసిన సంగతి ప్రజలు మరచిపోలేదన్నారు.
31వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి ఊరడి హైమావతిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. సుదర్శన్‌రెడ్డి వ్యక్తిగత, రాజకీయ సుధీర్ఘ ప్రయాణం గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసుననని, అలాంటి కుటుంబాన్ని ఆదరిస్తే నిస్వార్థంగా వార్డు అభివృద్ధికి పాటుపడుతారని వారు పేర్కొన్నారు. సీపీఎం మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నారపాటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.