మధిర ఫిబ్రవరి21 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు(Kamal Raj) ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో సాగు నీరు రాక ఎండిపోతున్న పంటల చూసి ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు ఎల్లయ్య కుటుంబాన్ని మధిర బీఆర్ఎస్ పార్టీ బృందం పరామర్శించారు. అనంతరం కౌలు రైతు ఎల్లయ్య సాగుచేసిన పైరును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండ నిలిచారన్నారు. రైతు బీమా, సాగునీరు 24 గంటల విద్యుత్ పంటల కొనుగోలు వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులను రాజుగా చేశారన్నారు. ఈ పాలనలో మాత్రం కనీసం సాగునీరు అందక పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి రైతుల గోస వినిపించటం లేదన్నారు. సాగు చేస్తున్న పంటలు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతు కళ్లెదుట ఎండిపోయిన పంటలను చూసి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు సాగునీరు అందించి మృతి చెందిన ఎల్లయ్య కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు గురజాల హనుమంతరావు, మంకెన రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వెంకట రామారావు, గడ్డం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.