ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో పాలన పడకేసిందని, రైతులు కన్నీళ్లు పెడుతుంటే సీఎం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితిలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేసినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.
రెండురోజుల ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఖమ్మం వచ్చిన కవిత.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గృహంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షాల వల్ల కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా, ఆసుపత్రుల్లో చిన్నారులు మృత్యువాత పడుతున్నా సీఎం పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కష్టాలపై ఒక మంత్రి కూడా కనీసం సమీక్ష చేయడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ కర్షకుల కష్టాల గురించిగానీ, తడిసి ధాన్యం గురించిగానీ ఆలోచించకపోవడం దుర్మార్గమని అన్నారు.
జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించుకుంటున్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు ములుగు పర్యటనకు పోతే ఆసుపత్రిలో పసిపాప మృతిచెంది తల్లిదండ్రులు ఆవేదనతో పాపను చూపిస్తున్నా మంత్రులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక హామీ అమలు కావడంలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రుణమాఫీని సంపూర్ణం చేశామంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఘోరమైన అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రైతు కూలీలకు ఇస్తామన్న రైతుభరోసా పథకం ఏమైందని ప్రశ్నించారు. తాను ఖమ్మం రాగానే కాంగ్రెస్ నాయకుడొకరు తన బాధను వ్యక్తం చేస్తూ గ్రామశాఖ పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషిచేసిన నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకొని ఎందుకు ఓటు వేశామంటూ బాధపడుతున్నారని అన్నారు.
ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అంటుంటారని, మరి ఈ కమ్యూనిసుల్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో కమ్యూనిజం మీద నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. ‘ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పెద్దలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్లే ప్రశ్నించడం లేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన 10 నెలల్లోనే ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్ నిర్మించి 60 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఖమ్మం జిల్లాకు ఒక కొత్త పథకం గానీ, ప్రాజెక్టు గానీ లేవని విమర్శించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో ఇచ్చిన ప్రతి మాటనూ నెరవేర్చారని గుర్తుచేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధులను ప్రజలు ఎకడికక్కడ నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో తెలంగాణలో ఒక ఉత్సాహకర వాతావరణ నెలకొనబోతోందని అన్నారు. రజతోత్సవాన్ని విజయవంతం చేయాలని, బలమైన నాయకత్వమున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మదన్‌లాల్, చంద్రావతి, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.