కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇప్పటి వరకు షెడ్యూల్ క్యాస్ట్స్ డిపార్ట్మెంట్ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. అయితే ఆ బాధ్యతల నుంచి బదిలీ చేస్తూ రాష్ట్రంలోనే కీలక ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అదే ఉత్తర్వుల్లో సింగరేణి సీఎండీగా ఫుల్ అడిషనల్ చార్జి నిర్వహిస్తున్న కృష్ణ భాస్కర్‌ను ఆ అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. జ్యోతి బుద్ధ ప్రకాశ్ పరిపాలనా రంగంలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా, కలెక్టర్‌గా, ఎన్నికల విభాగంలో ఉన్నత బాధ్యతలు, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాల్లో కీలక పదవులు ఆయన నిర్వర్తించారు. వైద్య విద్యను అభ్యసించినా.. ఐఏఎస్ అధికారిగా పరిపాలనా సేవల్లో సమర్థుడిగా మంచి గుర్తింపు పొందారు.