ఖమ్మం, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకటా.. రెండా ఎన్నింటిని తట్టుకోవాలి రైతులు. విత్తు వేసింది మొదలు.. పంట చేతికందే వరకూ అన్నదాతలకు అన్నీ కష్టాలే. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లోనూ అన్నీ తిప్పలే. అధికారులు, పాలకవర్గానికి జీరో దందా, ఆర్డీల మీద ఉన్న మమకారం అన్నదాతలపై లేకుండాపోయింది. వారి పట్టింపులేని తీరుతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులు పంటను వర్షానికి అర్పణం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభయ్యాయి. వానకాలంలో పండించిన పత్తి పంట చేతికందడంతో రైతులు మార్కెట్లో అమ్ముకునేందుకు తీసుకొస్తున్నారు. రైతులు తీసుకొచ్చే పంటలకు అనుగుణంగా మార్కెట్లో సౌకర్యాలను సమకూర్చాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో మార్కెట్ పాలకవర్గం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో మార్కెట్‌కి రైతులు తెచ్చే పత్తి పంట ఏమాత్రం నీటిపాలుకాకుండా అవసరమైన టార్పాలిన్ పట్టాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మార్కెట్లో టార్పాలిన్ పట్టాలు మచ్చుకైనా కానరాక ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అప్పటికే మార్కెట్‌కు వచ్చిన పత్తి పంట తడిసి ముద్దయ్యింది. వర్షం వస్తున్న సమయంలో టార్పాలిన్లు లేక పత్తి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు. టార్పాలిన్ల కోసం పరుగులు తీయడం కనిపించింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు భరోసానిచ్చే వారే కరువయ్యారు. పాలకవర్గం ఉన్నా మార్కెట్లో రైతులను పట్టించుకోని తీరు కనిపిస్తోంది. తమకు పదవులను కట్టబెట్టిన నాయకులకు దాసోహమంటూ నిత్యం వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే తప్ప మార్కెట్లో రైతుల బాగోగులను పట్టించుకునే నాధులే కరువయ్యారనే అపవాదు పాలకవర్గం మూటగట్టుకుంటోంది. ఇక బాధ్యత గల అధికారులదీ ఇదే తీరు. సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ.. ఆరుగాలం పండించి పంటలను మార్కెట్లో అమ్ముకునేందుకు తెచ్చిన రైతులపై ఏమాత్రం లేకుండాపోయింది. జీరో దందా, ఆర్డీల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.