ఖమ్మం, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ర్టానికి చోటు దక్కకపోగా.. జిల్లాకు ప్రాధాన్యం, కేటాయింపులు లేవని పలు వర్గాలు పెదవి విరుస్తున్నాయి. భద్రాచలం, కొవ్వూరు రైల్వే లైన్‌ను విస్మరించారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదని, గిరిజన యూనివర్సిటీకి కేటాయింపులు లేవని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల కోసం ప్రవేశపెట్టినట్లుగా బడ్జెట్ ఉన్నదని, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన రెండు రాష్ర్టాలకే అధిక మొత్తంలో కేటాయింపులు ఉన్నట్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వేతన జీవులు, పేద, మధ్యతరగతి వర్గాలపై భారం మోపే విధంగా ఉందని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు మొండిచేయి చూపించారని, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు విఫలమయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల ప్రయోజనాలకు, అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా ఉంది. తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు కేంద్ర విద్య, వైద్య రంగసంస్థల ఏర్పాటు చర్యలు శూన్యం.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
8 మంది ఎంపీలున్నా ఫలితం శూన్యం..
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలున్నా బడ్జెట్లో ఫలితం శూన్యంగా కన్పించింది. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి వారు కనీసం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శోచనీయం. అలాగే గడిచిన పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసుకుంటూ వస్తోంది. మంగళవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగాల కల్పనపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. నైపుణ్య అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు ప్రభుత్వ రంగ ఉద్యోగాల కల్పనపై హామీ ఇవ్వకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది. తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గత ఎన్నికల ముందు బీజేపీ చెప్పిన మాటలు నీటిమూటలు అయ్యాయి.
-మేకల ఉదయ్, యువజన సంఘం నేత, ఖమ్మం రూరల్
ప్రజా వ్యతిరేక బడ్జెట్
వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు ఉపయోగం లేని బడ్జెట్. సంపన్నులు, విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రవేశపెట్టినట్లుగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దేశం ఏటా 20 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. దేశంలో రెండు రాష్ర్టాలే ఉన్నట్లు.. మిగిలిన రాష్ర్టాల ప్రయోజనాలను పట్టించుకోలేదు.
-నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి
మధ్యతరగతి ప్రజలను విస్మరించారు..
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలను విస్మరించారు. ప్రజల వైపు ఆలోచన చేయకుండా వ్యాపారుల కోసం అర్రులు చాచేలా ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు మొండిచేయి చూపించారు. దీనికి తెలంగాణలోని బీజేపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేని విధంగా ఉంది కేంద్ర బడ్జెట్. దీనిపై బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలి.
-పోటు ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి
తెలంగాణకు మొండిచేయి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మొండిచేయి చూపింది. కేవలం నాలుగైదు రాష్ర్టాలకే బడ్జెట్ కేటాయింపు చేసినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బడ్జెట్ కేటాయించకపోవడం దారుణం. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేకుండా పోయింది. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గిరిజనులను పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఇది పూర్తిగా తెలంగాణ వ్యతిరేక బడ్జెట్.
-మూడ్ జయరాంనాయక్, బీఆర్ఎస్ యువనేత,చుంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం రైల్వే లైన్‌ను విస్మరించారు..
కేంద్రం వివక్షతో కూడిన రాజకీయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈసారి బడ్జెట్లో భద్రాచలం, కొవ్వూరు రైల్వే లైన్‌ను విస్మరించింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు స్పష్టమైన, నిర్ధిష్టమైన హామీ ఇవ్వకపోవడం అన్యాయం చేసినట్లే. పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలం, పినపాక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నా.. వాటి విషయంలో కేంద్రం ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వలేదు. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలిపే విషయంలో ఎటువంటి స్పష్టత లేదు. ఈ బడ్జెట్ పేదలను కొట్టి పెద్దలకు పెట్టేదిగా ఉంది.
-మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకుడు, భద్రాచలం
వేతన జీవులకు నిరాశే..
కేంద్ర బడ్జెట్ వేతన జీవులకు సంతృప్తి కలిగించలేదు. పాతపన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడం నిరాశ కలిగించింది. నూతన పెన్షన్ విధానాన్ని తొలగించి.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేస్తారని వేతన జీవులు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ.. బడ్జెట్లో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడంతో నిరాశ మిగిలింది. మరోవైపు తెలంగాణ రాష్ర్టానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం బాధాకరం.
-బీ.మధుసూదన్‌రాజు, రిటైర్డ్ టీచర్, సత్తుపల్లి
బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా..
ఆంధ్రాలో వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్లో నిధులిచ్చినప్పుడు.. మరి తెలంగాణలో వెనుకబడిన పది జిల్లాలకు ఎందుకు నిధులు కేటాయించలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష ఇక్కడి కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. ఐటీఐఆర్, ఐసర్, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించలేదు. కనీసం పునర్విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించలేదు. బడ్జెట్లో తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్లో కేంద్రం ఇచ్చింది గుండు సున్నాయే.
-యెర్రా కామేష్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం
బీజేపీ భాగస్వామ్య పక్షాల బడ్జెట్
బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాల పాలిత రాష్ర్టాల బడ్జెట్‌గా ప్రజలకు అర్థమవుతుంది. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజల డిమాండ్‌గా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాల ఊసే లేదు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీని ప్రకటించలేదు. నిరుద్యోగానికి తోడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలపై భారం పడుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదు.
-పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి
కార్పొరేట్లకు అనుకూలంగానే..
బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగానే వ్యవహరిస్తోంది. విద్యార్థి లోకానికి తీవ్ర నిరాశను మిగిల్చింది. యువతకు ఉపాధి, నైపుణ్యానికి పెద్దపీట పేరుతో కార్పొరేట్ అవసరాలను తీర్చే మానవ వనరులను తయారు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 500 టాప్ మల్టీ నేషనల్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌కు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.5 వేలు నెలవారీ ైస్టెఫండ్ ఇస్తామనడం విడ్డూరంగా ఉంది. -సండ్ర భూపేందర్, భద్రాచలం