దమ్మపేట, జూలై 17 : రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుబంధు కన్వీనర్ రావు జోగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందున్న కాంగ్రెస్ కావాలా.. రైతు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ కావాలా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నుంచి ఈనెల 27 వరకు పది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 67 రైతు వేదికల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పర్యవేక్షణలో రైతుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు వేదికల వద్ద రైతులను సమావేశపరిచి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తీర్మానాల ద్వారా నిరసన వ్యక్తం చేయాలని ఆయన కోరారు.
మూడు గంటలు సరిపోదు
రేవంత్‌రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంటు ఇస్తే అరెకరం కూడా తడవదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్‌తో రెండు పంటలు పండిస్తున్నా. రైతుబంధు, రైతుబీమా అందించి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుం టుంది. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటు వేస్తాను.
– గుగులోత్ కోట్యా, రైతు, కరివారిగూడెం కాలనీ, జూలూరుపాడు మండలం
25 ఎకరాలు సాగు చేస్తున్నా
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో నాలుగేళ్లుగా ఏటా 25 ఎకరాల్లో సాగు చేస్తున్నా. ప్రతి సంవత్సరం వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నా. ఆర్థికంగా స్థిరపడడంతోపాటు పట్టణాల్లో ఉన్న భవనాన్ని తలపించేలా గ్రామంలో ఇల్లు కట్టుకున్నా. కేసీఆర్ ప్రభుత్వానికి జీవితకాలం రుణపడి ఉంటా.
– ఉసికల శ్రీను, రైతు, అనంతారం, జూలూరుపాడు మండలం
ఉచిత విద్యుత్ బీఆర్ఎస్దే
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక పథకాలతోపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. వర్షాలు ఉన్నా.. లేకున్నా రెండు పంటలు పండించడంతో సాగులో లాభాలు ఆర్జిస్తున్నా. కేసీఆర్ పాలనలో రైతులంతా సుభిక్షంగా ఉన్నారు. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ ప్రభుత్వానికే మా మద్దతు ఉంటుంది.
– గుగులోత్ రాంబాబు, రైతు, నర్సాపురం, జూలూరుపాడు మండలం
కరెంట్‌తోనే పంటలు
సాగుకు 24 గంటల కరెంట్ లేకపోతే పంటలు పండవు. బోరు బావుల కింద కరెంట్‌పైనే ఆధాపరడి పంటలు సాగు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయా యి. మళ్లీ కాంగ్రెస్ వస్తే పాత రోజులొస్తాయి. వ్యవసాయం చేస్తున్న రైతుల నోట్లో మన్నుకొట్టాలని కాంగ్రెస్ చూస్తున్నది. వారి అవగాహన లేని మాటలు రైతులు నమ్మొద్దు.
– నరెడ్ల ప్రవీణ్‌కుమార్ వర్మ, రైతు సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్, ఆళ్ళపల్లి
ఏడాదికి రెండు పంటలు
ఉచిత విద్యుత్‌తో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నాం. గతంలో రాత్రిపూట కరెంట్‌తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 24 గంటల ఉచిత విద్యుత్‌తో మాకు తోచిన సమయంలో వెళ్లి పొలానికి నీరు పెట్టుకునే సౌకర్యం సీఎం కేసీఆర్ కల్పించారు. కాంగ్రెసోళ్లు అన్న మాటలకు మూడు గంటల కరెంటుతో పొలానికి నీరెలా పారుతుంది. చీకటి రోజులు తేవడమే వారి లక్ష్యం. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్‌తో పంటలు పండుతున్నాయి.
– కండె రాంబాబు, రైతు సంఘం సహాయ కార్యదర్శి, ఆళ్ళపల్లి