రామవరం, ఏప్రిల్ 19 : ఓసీలకు తాము వ్యతిరేకం కాదని, కాకపోతే ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పెంచాల్సిన అవసరం ఉందని, డీఎంఎఫ్ నిధులను ప్రభావిత ప్రాంతాల పంచాయతీలకు నేరుగా అందేవిధంగా చూడాలని, పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తి దృష్ట్యా ఓసీల ఆవశ్యకత ఏర్పడిందని, దానికి అనుగుణంగా ఓసీల ఏర్పాటు జరుగుతోందని, ఓసీలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్ ఖని (వీకే 7, పీవీకే 5, జీకేవోసీ కలయిక) ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఎన్జీవోలు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ… పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఓసీలు ఏర్పాటు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని, ఆ దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఓసీల్లో ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతోపాటు సింగరేణి సంస్థ కూడా తోడ్పాటును అందిస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు. సభాధ్యక్షుడిగా అదనపు కలెక్టర్ పాల్గొనగా, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిశంకర్ పర్యవేక్షణలో సభ నిర్వహించారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ వెంకటేశ్ ఓపెన్‌కాస్ట్ ఏర్పాటు చేసిన ఈ సభలో వక్తలు నిరభ్యంతరంగా ప్రతి అంశంపై మాట్లాడవచ్చని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తామని, ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని రికార్డు చేసుకొని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు పంపిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు.
అనంతరం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం చిలుకూరి నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) అనుమతితో జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామం సమీపంలో ప్రతిపాదించిన వీకే కోల్‌మైన్ ఆశ్యకతను ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, రీజినల్ సెక్రటరీ కూసన వీరభద్రం, బోరింగ్ శంకర్, చిలక రాజయ్య, గోపు కుమార్, సత్తార్‌పాషా, శ్రీరాంమూర్తి, శేఖర్, నటరాజ్, గౌస్, విప్లవ్, మోహన్‌రెడ్డి, కుమార్, నర్సింగం, సకినాల సమ్మయ్య, నిమ్మల రాజు, ఘనపనేని శ్రీనివాస్, మురళి, క్రాంతి, మురాద్, భీముడు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా, సలిగంటి శ్రీనివాస్, ఏఐటీయూసీ నుంచి శేషయ్య, వంగా వెంకట్, ఐఎన్టీయూసీ నుంచి శంకర్‌నాయక్, త్యాగరాజన్, ఆల్బర్ట్, కాల్వ నాగభూషణం, హెచ్ఎంఎస్ నుంచి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వీకే 7 ఇైంక్లెన్ మైన్ మూసివేస్తున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానికంగానే సర్దుబాటు చేయాలి. వనమానగర్, మాయాబజార్, ఎస్ఆర్టీ ఏరియాలో ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయపరమైన ప్యాకేజీ ఇవ్వాలి.
– ఎండీ రజాక్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు
జనం కోసం సింగరేణి కావాలి… కానీ సింగరేణి కోసం జనం కాకూడదు. కాంట్రాక్టు కార్మికులకు హక్కులు కల్పించాలి. నష్టపరిహారం చెల్లింపు విషయంలో రాజీ పడొద్దు. ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలి. అవుట్ సోర్సింగ్ నియామకాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలి.
– కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే
ప్రభావిత 14 పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలోని 7 వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిమ్మలగూడెంలో అత్యధికంగా కిడ్నీ బాధిత కేసులు నమోదవుతున్నాయి. నిమ్మలగూడెంలో ఆర్వో ప్లాంట్ నిర్మించాలి. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి. పార్కులు, ఆట స్థలాలను ఏర్పాటు చేయాలి.
– కంచర్ల చంద్రశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్
గతంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో మున్సిపాలిటీ పరిధిలోని ప్రభావిత ఏడు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకురాగా చాలా అంశాలను పరిశీలించి పూర్తి చేశారు. చిరు వ్యాపారుల కోసం దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేయాలి. పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లకు ఇండోర్ షటిల్ కోర్టు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలి.
– కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్