ఖమ్మం, జూలై 6: కేంద్ర ప్రభు త్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ ఖమ్మం రీజియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జాక్) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని సీహెచ్.వీ.రామయ్య స్మారక భవనం(ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యాలయం)లో గుండు మాధవరావు, బూదాటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఆర్టీసీ ఖమ్మం రీజియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో స్టాఫ్ అండ్ వరర్స్ యూనియన్(ఐఎన్టీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రచార కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజినల్ కార్యదర్శి పిల్లి రమేష్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఖమ్మం రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్‌లు మాట్లాడారు.
భారత కార్మికవర్గ ఐక్య పోరాటాల స్రవంతిలో ఆర్టీసీ కార్మికులందరూ భాగస్వామ్యలు కావాలని, జూలై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చట్టాల మార్పు పేరుతో కార్మికవర్గాన్ని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు కట్టుబానిసలుగా చేసే విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి సంస్థను క్రమంగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పజెప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వరర్స్ యూనియన్ నాయకులు పగిళ్లపల్లి నరసింహారావు, బేతంపూడి బుచ్చిబాబు, దేశబోయిన జగన్నాథం, గుగ్గిళ్ల రోశయ్య, బుగ్గవీట్టి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.