కూసుమంచి, ఫిబ్రవరి 23 : గత ఎన్నికల్లో ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలు అవుతున్నా కనీసం వారి ఊసెత్తడంలేదని, తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసిన వారిని అక్కున చేర్చుకుంటామని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ అన్నారు. ఆదివారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జిల్లా ఉద్యమకాలరుల జేఏసీ ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సుల్తాన్ మాట్లాడుతూ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు త్యాగాలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా తెలంగాణద్రోహులను అందలం ఎక్కించడం తగదన్నారు. ప్రజా ఆకాంక్షల మేరకు పరిపాలన జరగాలని కోరారు. బత్తుల సోమయ్య మాట్లాడుతూ ఉద్యమకారుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలన్నారు. అనేకమంది ఉద్యమకారులు వయస్సు పైబడి అనారోగ్యంగా ఉన్నారని, చివరి దశలోనైనా వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రపుల్రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోతి మాధవీరెడ్డి, 1969 ఉద్యమ నాయకులు అన్వర్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాల్జారెడ్డి, డిజిటల్ మీడియా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కోశాధికారి చంద్రన్నప్రసాద్, కళాబృందం నాయకులు డోలక రాములు,
జిల్లా నాయకులు పాల్గొన్నారు.