భద్రాచలం, ఏప్రిల్ 3 : భావితరాలకు సమాచార వేదికగా ట్రైబల్ మ్యూజియం నిలుస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని తన ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవి బిడ్డల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పేందుకు ట్రైబల్ మ్యూజియం వారధి కానున్నదని తెలిపారు. ఆదివాసీలు వినియోగించిన అతి పురాతన వస్తువులను సేకరించి మ్యూజియంలో భద్రపరిచామని, ఇవి పర్యాటకులు, భక్తులను ఆకట్టుకుంటాయన్నారు.
గిరిజనుల ఇళ్లు, వాకిళ్లు, ఎడ్ల బండ్లు, వేటకు ఉపయోగించిన వస్తువులు, పనిముట్లకు మ్యూజియం వస్తుశాల కానున్నదన్నారు. శ్రీరామనవమి నాటికి మ్యూజియం ప్రారంభం కానున్నదని, ఇందులో గిరిజన వ్యవహారాలకు సంబంధించి చిత్రాలు, కళాఖండాలు మంత్రముగ్దులను చేస్తాయన్నారు. ట్రైబల్ మ్యూజియంలో అన్ని సకల సదుపాయాలు కల్పించడంతోపాటు పర్యాటక స్పాట్‌గా తీర్చిదిద్దనున్నట్లు పీవో పేర్కొన్నారు. యూనిట్ అధికారులు, ఆదివాసీ సంఘాలు ఎంతో కష్టపడి మ్యూజియంను ఏర్పాటు చేసుకున్నారని, దీని వెనక వారి కృషి ఎంతో ఉందన్నారు.