భద్రాచలం, జనవరి 27: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ సక్రమంగా జరిగేలా సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అర్జీలన్నీ సంబంధిత యూనిట్ అధికారులు గ్రామాల వారీగా ఆన్లైన్లో పొందుపరిచి అర్హులకు సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్‌రాజు, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏపీవో పవర్ వేణు, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, పీవీటీజీ అధికారి మనిధర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.