భద్రాచలం, ఫిబ్రవరి 10: అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తామని, వాటిని సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆదివాసీ గిరిజనుల నుంచి పీవో అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని వాటిని పరిష్కరించి, మిగిలిన వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు జీవనోపాధి పెంపొందించేందుకు యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం వంటి అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ఏవో సున్నం రాంబాబు, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఎస్వో ఉదయ్‌భాస్కర్, ఏపీవో పవర్ వేణు, ఆర్వోఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి జిల్లా పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పీవో రాహుల్ తెలిపారు. 12న ఉదయం 9 గంటలకు అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతోపాటు ఆధార్, కుల ధ్రువీకరణ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో ఇన్ ఫార్మసీ, డిప్లొమో, పీజీ, బీటెక్ తదితర విద్యార్హతలు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 8179925586, 6302608095 నంబర్లలో సంప్రదించాలని పీవో కోరారు.