పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 25: పదో తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులతోనే భవిష్యత్‌కు మంచి మలుపు అవుతుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఉల్వనూరు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి మార్కులతో పాసైతేనే కష్టానికి తగిన ఫలితం లభించినట్లు అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ కష్టపడి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, వారి శ్రమను అర్థం చేసుకుని ఉత్తీర్ణత సాధించి వారికి మంచిపేరు తేవాలని కోరారు.
క్రమశిక్షణ, ప్రత్యేక శ్రద్ధతో చదువుకొని 10/10 ర్యాంకు సాధించాలని ఆకాంక్షించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం కిన్నెరసానిలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో వేదిక్ మ్యాథ్స్ తరగతి గదిని పీవో సందర్శించారు. ఉపాధ్యాయురాలు బోధిస్తున్న తీరును విద్యార్థుల మధ్య కూర్చొని విన్నారు. గణితం పట్ల భయాన్ని పోగొట్టేందుకు వేదిక్ మ్యాథ్స్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అనంతరం సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి అవసరమైన మెటీరియల్ కొరకు తనను సంప్రదించాలన్నారు.కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, ఉల్వనూరు హెచ్ఎం విజయలక్ష్మి, కిన్నెరసాని హెచ్ఎం రామారావు పాల్గొన్నారు.