బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 11 : గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటూ నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎంహెచ్ హాస్టల్‌ను బుధవారం సందర్శించిన ఆయన పరిసరాలు, డార్మెటరీ, డైనింగ్ హాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్‌పై ఉందని, నిత్యం సెల్ఫోన్లు వాడకుండా, ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా చూసుకోవాలన్నారు.
పీఎంహెచ్ హాస్టల్‌కు శాశ్వత భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని నర్సింగ్ కళాశాలను సందర్శించి.. పరిసరాలు, డార్మెటరీ, వంటశాల, టాయిలెట్లు, బాత్రూంలను తనిఖీ చేశారు. వంటషెడ్డు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీఈ హరీశ్, టీఏ శ్రీనివాస్, వైద్యులు చైతన్య, వార్డెన్లు సుశీల, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.