పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 27: కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిదను తరలించేందుకు కమిటీ వేస్తామని, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు యాష్‌ను తరలించే బాధ్యతలు అప్పగిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. కేటీపీఎస్ కాలుష్య ప్రభావిత ప్రాంతాలైన కరకవాగు, పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాలను శుక్రవారం కేటీపీఎస్ అధికారులతో కలిసి పీవో సందర్శించారు. బూడిద వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
యాష్ పాండ్ నుంచి బూడిదను తరలించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఇటీవల పలు గ్రామాల నిరుద్యోగులు పీవోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేటీపీఎస్ అధికారులు, సొసైటీ సభ్యులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి అనుభవం ఉన్న వారితో దరఖాస్తుదారుల సమక్షంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని పీవో తెలిపారు. ఆ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే యాష్‌ను తరలించే బాధ్యతను అప్పగిస్తామన్నారు. ఏపీవో డేవిడ్ రాజ్, కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్లు ప్రభాకర్‌రావు, వెంకటేశ్వర్లు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.