దుమ్ముగూడెం, డిసెంబర్ 5 : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్‌లలో చదువుతున్న విద్యార్థుల వసతి సౌకర్యాలు, వారి చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో బి.రాహల్ సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లను ఆదేశించారు. నారాయణరావుపేట బాలుర, మంగువాయి బాడువ బాలికల ఆశ్రమ పాఠశాల, గంగారం, ఆదర్శ నగర్ జీపీఎస్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగువాయి బాడవ, నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలలో ఇంజినీరింగ్ పనులను పరిశీలించి, నాణ్యతగా ఉండేలా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎంలు దగ్గరుండి మీకు నచ్చిన విధంగా పనులు చేయించుకోవాలని సూచించారు.
అలాగే ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన నారాయణరావుపేట ఏహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, హెచ్ఎం బాధ్యతల నుంచి తప్పించాలని డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. అనంతరం మంగువాయి బాడవ గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో కలిసి భోజనాలు చేశారు. భోజన నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత గంగారం జీపీఎస్‌ను సందర్శించి, ఉద్దీపకం వర్బుక్లోని అంశాలను పిల్లల చేత బోర్డుపై రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదర్శ నగర్ జీపీఎస్‌లో ఉద్దీపకం వర్బుక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు బాలాజీ, వీరమ్మ, ఉపాధ్యాయులు లక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.